*నేటి సాక్షి – కోరుట్ల*
ప్రభుత్వ పథకాల పేరుతో అమాయకులు, ముఖ్యంగా వృద్ధులను లక్ష్యంగా చేసుకుని దృష్టి మళ్లించి బంగారు ఆభరణాలు అపహరిస్తున్న అంతర్‌జిల్లా దొంగల ముఠాను కోరుట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్దిపేట జిల్లాకు చెందిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి సుమారు 24 గ్రాముల బరువున్న బంగారు గొలుసుతో పాటు రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడిపై గతంలోనే 100కు పైగా కేసులు నమోదై ఉండటం ఈ ముఠా నేర చరిత్ర తీవ్రతను వెల్లడిస్తోంది.
*పెన్షన్ పేరుతో నమ్మించి... బంగారు గొలుసుతో పరార్*
పోలీసుల కథనం ప్రకారం, సిద్దిపేట ప్రాంతంలో గుర్తుపట్టే అవకాశం ఉండటంతో అల్లెపు కృష్ణ (51), కుంచెపు శ్రీకాంత్ (30), అల్లెపు రాజ్‌కుమార్ (28) కోరుట్లకు వచ్చి స్థానిక లాడ్జిలో బస చేశారు. జూలై 16న బస్టాండ్ వద్ద కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన అల్లె భాగీర్త సుమారు 70 ఏళ్ల వృద్ధురాలిని పలకరించి, ఆమెకు వచ్చే పెన్షన్‌ను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచిస్తామని నమ్మించారు. అనంతరం ఎస్‌బీఐ బ్యాంకు సమీపానికి తీసుకెళ్లి, మెడలో బంగారు ఆభరణాలు ఉంటే పెన్షన్ రాదని మాయమాటలు చెప్పి, ఆమె మెడలోని లక్ష్మీదేవి బిళ్లల బంగారు గొలుసును తీసుకుని పరారయ్యారు.
*లాడ్జిలోనే మాటువేసి పట్టుకున్న పోలీసులు*
దొంగతనాలకు పాల్పడిన అనంతరం మరిన్ని నేరాలకు పాల్పడాలనే ఉద్దేశంతో నిందితులు కోరుట్లలోని లాడ్జిలోనే ఉండగా, పోలీసులు నిఘా పెట్టి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 24 గ్రాముల బరువున్న బంగారు గొలుసు, ఒక రియల్‌మీ మొబైల్ ఫోన్, ఒక శామ్‌సంగ్ మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని చట్టపరమైన పంచనామా నిర్వహించారు.
*100కు పైగా కేసులున్న ప్రధాన నిందితుడు*
విచారణలో ప్రధాన నిందితుడు అల్లెపు కృష్ణపై రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో 100కు పైగా కేసులు నమోదైనట్లు వెల్లడైంది. మిగతా ఇద్దరు నిందితులపై కూడా పలు దొంగతనాల కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ముగ్గురిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపర్చేందుకు తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు.
*అపరిచితులను నమ్మొద్దు:*
( కోరుట్ల సిఐ లక్ష్మీనారాయణ హెచ్చరిక )
ప్రభుత్వ పథకాలు, పెన్షన్ పెంపు, బ్యాంకు పనులు లేదా ఇతర హామీల పేరుతో అపరిచితులు సంప్రదిస్తే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుట్ల సిఐ లక్ష్మీనారాయణ, ఎస్ఐ చిరంజీవి లు సూచించారు. విలువైన బంగారు ఆభరణాలను ఎవరికీ అప్పగించవద్దని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్–112కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
______
Telangana
*దృష్టి మళ్లించి దోపిడీలు.!* *అంతర్‌జిల్లా దొంగల ముఠా అరెస్ట్.!! --------------------------- * కోరుట్ల పోలీసుల చాకచక్యంతో ముగ్గురు నిందితులు అదుపులోకి * 24 గ్రాముల బంగారు గొలుసు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం * పెన్షన్ పెంచిస్తామంటూ వృద్ధురాలిని మోసం చేసిన ముఠా ---------
Quick Summary:
* కోరుట్ల పోలీసుల చాకచక్యంతో ముగ్గురు నిందితులు అదుపులోకి