*నేటి సాక్షి – కోరుట్ల ( రాధారపు నర్సయ్య )*
----------
*"రాహుల్ ఎక్కడున్నావ్ రా..? ఒక్కసారి ఇంటికి రా..!" అంటూ తల్లి గుండె పగిలేలా చేసిన వేడుకోలు రాష్ట్రాన్ని కదిలించింది. క్షేమంగా తిరిగి వస్తాడని ఆశించిన ఆ తల్లిదండ్రులకు చివరకు కొడుకు మృతదేహం కూడా వెంటనే దక్కలేదు. ఒకవైపు కన్నకొడుకును కోల్పోయిన బాధ.. మరోవైపు అతని భౌతికకాయాన్ని, అనంతరం అస్థికలను సైతం స్వగ్రామానికి తీసుకురావడానికి 52 రోజుల పాటు సాగిన పోరాటం.. ఎట్టకేలకు ముగిసింది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్‌కు చెందిన బీటెక్ విద్యార్థి 'అంకం రాహుల్' అస్థికలు సోమవారం స్వగ్రామానికి చేరుకోవడంతో గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది. కుటుంబ సభ్యులు హిందూ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించగా.. గ్రామస్థులు కంటతడి పెట్టి నివాళులర్పించారు. కానీ రాహుల్ మరణం వెనుక అసలు నిజం ఏంటి.? అనే ప్రశ్న మాత్రం ఇంకా సమాధానం కోసం ఎదురుచూస్తూనే ఉంది.!"*
*ఒక ఆశగా వెళ్లిన కొడుకు.. అస్థికల రూపంలో కన్నీటి జ్ఞాపకంగా తిరిగొచ్చాడు.!*
అయిలాపూర్ గ్రామానికి చెందిన అంకం రాహుల్ హైదరాబాద్‌లోని మాతృశ్రీ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం చేసి కుటుంబానికి అండగా నిలుస్తాడని తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే గత నెల చివర్లో అతడు అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. కాచిగూడ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు కావడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు రాష్ట్రవ్యాప్తంగా గాలింపు చేపట్టారు.
*తల్లి ఆర్తనాదం.. రాష్ట్రాన్ని కదిలించిన వీడియో.!*
"నా కొడుకు ఎక్కడైనా కనిపిస్తే చెప్పండి.. మా బిడ్డను మాకు తీసుకురండి" అంటూ రాహుల్ తల్లి చేసిన వేడుకోలు సోషల్ మీడియాలో లక్షల మందిని కదిలించింది. ప్రజాప్రతినిధులు, సామాజిక సంస్థలు, వివిధ వర్గాల నాయకులు స్పందించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా స్పందించి పోలీసులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. అయినప్పటికీ కుటుంబం ఎదురు చూసింది మాత్రం శుభవార్తకే.
*హైదరాబాద్‌లో అదృశ్యం.. ఆంధ్రప్రదేశ్‌లో మృతదేహం.!*
కాచిగూడలో చివరిసారి కనిపించిన రాహుల్, అక్కడి నుంచి శబరి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. కొద్ది రోజుల తర్వాత ప్రకాశం జిల్లా సింగరాయకొండ సమీపంలోని ఓ బావిలో అతని మృతదేహం లభించడంతో ఆ ఆశలన్నీ ఒక్కసారిగా కూలిపోయాయి. మిస్సింగ్ కేసు ఒక్కసారిగా మిస్టీరియస్ డెత్‌గా మారిపోయింది. ఇది ఆత్మహత్యా.? హత్యా.? లేక మరేదైనా కుట్రా.? అన్న అనుమానాలు ఇప్పటికీ వెంటాడుతున్నాయి.
*అస్థికల కోసం 52 రోజుల పోరాటం*
మృతదేహం లభించిన తర్వాత కూడా కుటుంబ సభ్యుల కష్టాలు ఆగలేదు. చట్టపరమైన ప్రక్రియలు, దర్యాప్తు, కోర్టు అనుమతులు, అధికారిక ప్రక్రియల కారణంగా రోజుల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. చివరకు 52 రోజుల అనంతరం కోర్టు అనుమతితో రాహుల్ అస్థికలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. సోమవారం అవి అయిలాపూర్ చేరుకోగా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
*బీసీ సంఘాల ఉద్యమం.. న్యాయం కోసం ఒత్తిడి*
ఈ వ్యవహారంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు, వివిధ ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం నిర్వహించాయి. ధర్నాలు, రాస్తారోకోలు, వినతిపత్రాలు, అధికారుల వద్ద నిరంతర ఒత్తిడి తీసుకువచ్చిన తర్వాతే కేసులో పురోగతి కనిపించిందని సంఘ నాయకులు పేర్కొన్నారు. మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించడంలో, కేసు నమోదు చేయించడంలో తమ ఉద్యమం కీలక పాత్ర పోషించిందని వారు తెలిపారు.
*ఇంకా సమాధానం లేని ప్రశ్నలే.!*
రాహుల్ మరణం చుట్టూ ఇప్పటికీ అనేక ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. హైదరాబాద్ నుంచి సింగరాయకొండ వరకు అతని ప్రయాణం ఎలా సాగింది.? చివరిసారి ఎవరిని కలిశాడు.? ఎవరితో మాట్లాడాడు.? అతని మరణానికి దారితీసిన అసలు కారణం ఏమిటి.? కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్న అనుమానాల్లో నిజమెంత.? ఈ 52 రోజుల పాటు మృతదేహాన్ని అప్పగించకుండా ఎందుకు తాత్సారం చేశారన్నది ఇంకా మిస్టరీగానే మిగిలింది.ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది దర్యాప్తు సంస్థలేనని గ్రామస్తులు చెబుతున్నారు.
*అయిలాపూర్‌లో కన్నీటి వీడ్కోలు*
రాహుల్ అస్థికలు గ్రామానికి చేరుకున్నప్పుడు బంధువులు, స్నేహితులు, గ్రామస్థులు భారీ సంఖ్యలో తరలివచ్చి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులు హిందూ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. తల్లిదండ్రుల రోదనలు అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించాయి. చదువుకుని కుటుంబానికి అండగా నిలవాల్సిన యువకుడు చివరకు అస్థికల రూపంలో ఇంటికి చేరడం గ్రామాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది.
*నిజం వెలుగులోకి రావాలనే ఒక్కటే డిమాండ్*
అస్థికలు ఇంటికి చేరాయి... అంత్యక్రియలు పూర్తయ్యాయి... కానీ తల్లిదండ్రుల మనసులోని గాయం మాత్రం మానలేదు. "మా బిడ్డకు అసలు ఏమైంది?" అన్న ప్రశ్నకు సమాధానం దొరికే వరకు తమ పోరాటం ఆగదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రాహుల్ మరణంపై సమగ్ర దర్యాప్తు జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, తప్పు చేసిన వారు ఎవరైనా చట్టపరంగా శిక్షించబడాలని గ్రామస్తులు, ప్రజాసంఘాలు, బంధువులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. రాహుల్ కథ ముగిసిపోయి ఉండొచ్చు... కానీ న్యాయం కోసం అతని కుటుంబం మొదలుపెట్టిన పోరాటం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.
__________________________
Telangana
*అస్థికల కోసం.. అమ్మా-నాన్నల పోరాటం.!* -------------------------- * 52 రోజుల నిరీక్షణకు ముగింపు.. ఎట్టకేలకు స్వగ్రామానికి చేరుకున్న రాహుల్ అస్థికలు * 'మిస్సింగ్ నుంచి మిస్టీరియస్ డెత్' వరకు.. చివరకు కన్నీటి వీడ్కోలు * రెండు రాష్ట్రాల్లో ఉద్యమాలు.. బీసీ సంఘాల పోరాటం.. కోర్టు అనుమతితో కుటుంబానికి అప్పగింత ---------------------------
Quick Summary:
మిస్సింగ్ నుంచి మిస్టీరియస్ డెత్' వరకు.. చివరకు కన్నీటి వీడ్కోలు

