Telangana
*ఎల్‌నినో నేపథ్యంలో వరి సాగు వద్దు... ప్రత్యామ్నాయ పంటలే మేలు : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్* *ప్రతి అర్హ పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు* *35% వర్షపాతం లోటు... భూగర్భ జలాలు తగ్గుతున్నాయి* *సూపర్ ఎల్‌నినోలో తాగునీటికే తొలి ప్రాధాన్యత* *ప్రత్యామ్నాయ పంటలకు అవసరమైన విత్తనాలు సిద్ధం* *ధర్మారం మండలం నంది మేడారంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటన*
Quick Summary:
ప్రతి అర్హ పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు*
నేటి సాక్షి, ధర్మారం: ఎల్‌నినో నేపథ్యంలో వరి సాగు వద్దు, ప్రత్యామ్నాయ పంటలే మేలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తో కలిసి పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోని రైతు వేదికలో తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రస్తుత తీవ్ర ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ, ఆరుతడి పంటల సాగుపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రతి అర్హ పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేస్తోందన్నారు. ఆర్థిక పరిస్థితులు సవాలుగా ఉన్నప్పటికీ పేదల ఆత్మగౌరవాన్ని కాపాడటంలో ప్రభుత్వం ఎక్కడా వెనుకడుగు వేయదన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 35 శాతం వర్షపాతం లోటు నమోదైందని, భూగర్భ జలాలు కూడా వేగంగా తగ్గిపోతున్నాయని తెలిపారు. వాతావరణ శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కూడా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు సంప్రదాయ వరి సాగుపై ఆధారపడకుండా వ్యవసాయ శాఖ సూచించిన కందులు, పెసర్లు, మినుములు, ఇతర పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, కూరగాయలు, ఉద్యాన పంటలు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. తక్కువ నీటితో సాగయ్యే పంటలను ఎంచుకుంటే నష్టాలను తగ్గించుకోవచ్చని అన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు అందిస్తున్న సూచనలను ప్రతి రైతు పాటించాలని, అవసరమైన విత్తనాలు, సాంకేతిక సలహాలు, ప్రభుత్వ సహాయ సహకారాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం బోర్లలో నీరు కనిపిస్తున్నప్పటికీ పంట చివరి దశ వరకు అది నిలిచే పరిస్థితి లేదని, రోజురోజుకు భూగర్భ జలాలు తగ్గుతున్నందున వరి సాగు రైతులకు ప్రమాదంగా మారే అవకాశముందని పేర్కొన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో వరి సాగును పూర్తిగా నివారించాలని విజ్ఞప్తి చేశారు. ఆయిల్‌పామ్ పంట తక్కువ నీటితో సాగుతుందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రం కరోనా తరహా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోందని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ సూచనలు పాటించాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ... సూపర్ ఎల్‌నినో పరిస్థితుల్లో జిల్లాలో తాగునీటి సరఫరాను నిరంతరంగా కొనసాగించడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని తెలిపారు. ఈ సీజన్‌లో కాలువల ద్వారా సాగునీరు అందించే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయ పంటల సాగుకు అవసరమైన విత్తనాలను జిల్లాలో సమృద్ధిగా సిద్ధంగా ఉంచామని, రైతులు తక్కువ నీటి అవసరం ఉన్న పంటలనే ఎంపిక చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ప్రతి దశలో రైతులకు అండగా ఉంటుందని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే భూగర్భ జలాలు గణనీయంగా తగ్గాయని, ప్రస్తుతం బోర్లలో నీరు ఉన్నా పంట పెరిగే సమయంలో నీటి కొరత ఏర్పడి దిగుబడులు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని కలెక్టర్ సూచించారు. అనంతరం ఇటీవల విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పనులు నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిన కట్ట అశోక్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరఫున రూ.8 లక్షల ఆర్థిక సహాయ చెక్కును మంత్రి అందజేసి పరామర్శించారు. తదుపరి గ్రామంలో రూ.12 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన అంగన్‌వాడీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. చిన్నారులకు నాణ్యమైన విద్య, పోషకాహారం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అంతరం ధర్మారం ఎంపీడీవో కార్యాలయంలో 34 మంది లబ్ధిదారులకు రూ.34 లక్షల విలువైన కళ్యాణలక్ష్మి చెక్కులు, 73 మంది లబ్ధిదారులకు రూ.24,08,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రూప్లా నాయక్, వైస్ చైర్మన్ లింగయ్య, సర్పంచ్ వీర్ పాల్, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓలు), రైతులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.

