నేటిసాక్షి, మిర్యాలగూడ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమ కళాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి ఆదుకోవాలని, తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నకిరేకంటి కిరణ్ కుమార్ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఎంపిక కమిటీ సమావేశంలో ఆయన ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
తెలంగాణ ఉద్యమ సమయంలో వేలాది మంది కళాకారులు తమ పాటలు, ఆటలు, నాటికలు, బుర్రకథలు, ఒగ్గుకథలు, డప్పు వాయిద్యాల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపారని ఆయన తెలిపారు. తెలంగాణ వస్తే తమ జీవితాలు మారతాయని, కళకు గౌరవం లభిస్తుందని ఆశించి అనేక మంది కళాకారులు చదువులను మధ్యలోనే వదిలి ఉద్యమానికే అంకితమయ్యారని గుర్తు చేశారు.
రాష్ట్ర సాధనలో ఉద్యమ కళాకారుల పాత్ర ఎంతో కీలకమని, వారి కళారూపాలే ఉద్యమానికి ఊపిరిగా నిలిచాయని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమ త్యాగాలకు తగిన గుర్తింపు, ఉపాధి, గౌరవం లభిస్తుందని ఆశించిన కళాకారుల కలలు ఇప్పటికీ నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
గత పదేళ్లుగా అనేక మంది ఉద్యమ కళాకారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కుటుంబాలను పోషించుకోవడమే కష్టంగా మారిందని అన్నారు. ఉద్యమ కళాకారులను కేవలం సన్మానించడం మాత్రమే కాకుండా, వారి జీవితాలకు భరోసా కల్పించడం కూడా ప్రభుత్వ బాధ్యతేనని స్పష్టం చేశారు. అర్హులైన ఉద్యమ కళాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు లేదా స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. అలాగే సంక్షేమ పథకాలు, గృహ వసతి, ఆరోగ్య భద్రత, నెలవారీ ఆర్థిక సహాయం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ కోసం తమ యవ్వనాన్ని, జీవితాలను అంకితం చేసిన ఉద్యమ కళాకారులకు న్యాయం జరిగినప్పుడే తెలంగాణ ఆత్మకు నిజమైన అర్థం సాకారమవుతుందని నకిరేకంటి కిరణ్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ కోసం పాడిన గొంతులు నేడు ఆకలితో మౌనంగా ఉండకూడదని, ఉద్యమ కళాకారుల జీవితాల్లో వెలుగులు నింపే బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు.
Telangana
తెలంగాణ ఉద్యమ కళాకారులకు... ఉద్యోగాలు కల్పించాలి –ఎంపిక కమిటీకి నకిరేకంటి కిరణ్ కుమార్ విజ్ఞప్తి
Quick Summary:
ఎంపిక కమిటీకి నకిరేకంటి కిరణ్ కుమార్ విజ్ఞప్తి