Telangana
తెలంగాణ బోనాలు కల్చరల్ ఫెస్టివల్–2026 ఘనంగా నిర్వహణ -నటుడు, సామాజికవేత్త "మూసా అలీ ఖాన్" కు ఘన సత్కారం
Quick Summary:
-నటుడు, సామాజికవేత్త "మూసా అలీ ఖాన్" కు ఘన సత్కారం
నేటిసాక్షి, మిర్యాలగూడ : కళాకార్ తెలుగు టీవీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన తెలంగాణ బోనాలు కల్చరల్ ఫెస్టివల్–2026 కార్యక్రమం బిర్లా ప్లానిటోరియంలోని భాస్కర ఆడిటోరియంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో మిర్యాలగూడ పట్టణానికి చెందిన నటుడు, సామాజికవేత్త మూసా అలీ ఖాన్ ముఖ్య అతిథిగా పాల్గొని, ఘన సత్కారం అందుకున్నారు. బోనాల పండుగను పురస్కరించుకుని నిర్వహించిన ఈ సాంస్కృతిక వేడుకల్లో కళాకారుల నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సరస్వతీ ఉపాసకులు శ్రీ దైవజ్ఞ శర్మ, మిస్ సెలబ్రిటీ విన్నర్, మోడల్, ఇన్‌ఫ్లుయెన్సర్ కుమారి చకిళం సునిషతో పాటు పలువురు కళాకారులు పాల్గొన్నారు. కార్యక్రమ నిర్వాహకుడు డా. సిరాజ్ మాట్లాడుతూ, దేశ విదేశాల్లో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ, హైదరాబాద్‌లో బోనాల పండుగ సందర్భంగా ఈ వేడుక నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరి ఆశీర్వాదాలు పొందాలని ఆకాంక్షించారు. అనంతరం దాదాపు 200 మంది కళాకారులను అతిథులతో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నటుడు, సామాజికవేత్త మూసా అలీ ఖాన్, డా. సిరాజ్ దేశ విదేశాల్లో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా, ఎంతోమంది కళాకారులకు ప్రోత్సాహం లభించి, వారు సినిమా, టెలివిజన్ రంగాల్లో అవకాశాలు పొందుతున్నారని కొనియాడారు. చిన్ననాటి నుంచే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కళాకారులు క్రమశిక్షణ, పట్టుదలతో ఎదగాలని సూచించారు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని ఆకాంక్షిస్తూ, బోనాల పండుగ వేడుకల్లో పాల్గొనడం తనకు గర్వకారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
