నేటి సాక్షి,మునగాల,
ప్రభుత్వ భూములను కబ్జా చేయాలని చూసే వారికి ఇకపై ఎలాంటి ఉపేక్ష ఉండదని, ఎంతటి పలుకుబడి ఉన్న వ్యక్తులైనా చట్టం ముందు సమానమేనని కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ తీవ్ర హెచ్చరిక చేశారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి, ఆక్రమణలకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
మంగళవారం మునగాల మండల కేంద్రంలోని గణపవరం రోడ్డులో ఆర్‌అండ్‌బీ రహదారి పక్కన ఉన్న రెవెన్యూ శాఖకు చెందిన సర్వే నంబర్లు 490, 491లోని సుమారు 35 గుంటల విలువైన ప్రభుత్వ భూమిని ఆర్డీఓ స్వయంగా పరిశీలించారు. ఈ భూమిని ఒకే కుటుంబానికి చెందిన కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించేందుకు ప్రయత్నించడమే కాకుండా, మునగాల గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం కింద నాటిన మొక్కలను నిర్దాక్షిణ్యంగా ధ్వంసం చేసి, చెట్ల పెంపకానికి తవ్విన గుంతలను పూడ్చివేసిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించడం క్షమించరాని నేరమని స్పష్టం చేసిన ఆర్డీఓ, వెంటనే పోలీసు శాఖకు ఫిర్యాదు చేసి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని తహసీల్దార్ సరిత, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆస్తుల రక్షణలో నిర్లక్ష్యం వహించరాదని, ఆక్రమణదారులపై చట్టంలోని అన్ని నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ భూమి రెవెన్యూ రికార్డుల ప్రకారం పూర్తిగా ప్రభుత్వానిదేనని, దీనిపై ఎలాంటి కోర్టు వివాదాలు లేదా పెండింగ్ కేసులు లేవని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ భూమిని ఎవరూ వ్యక్తిగత ఆస్తిగా భావించరాదని, ఆక్రమణలకు పాల్పడితే తీవ్రమైన చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
భూమి చుట్టూ వెంటనే రక్షణ కంచె ఏర్పాటు చేసి, ధ్వంసమైన ప్రదేశంలో తిరిగి మొక్కలు నాటాలని రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భూములపై ఎలాంటి అక్రమ కార్యకలాపాలను సహించబోమని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే మరింత కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ పరిశీలనలో తహసీల్దార్ సరిత, ఎంపీడీవో రమేష్ దీనదయాల్, ఎంపీఓ నరేష్, ఆర్‌ఐ రామారావు, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ రాధాకృష్ణ వేణి తదితర అధికారులు పాల్గొన్నారు.
Telangana
ప్రభుత్వ భూముల కబ్జాలకు ఇక చెక్..! ప్రభుత్వ భూముల జోలికొస్తే ఎంతటి వారైనా ఉపేక్షించం .. కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ.. చెట్లు ధ్వంసం చేసిన వారిపై క్రిమినల్ కేసులకు ఆదేశం.. రక్షణ కంచె ఏర్పాటు చేసి భూమిని కాపాడాలని అధికారులకు స్పష్టమైన సూచనలు..
Quick Summary:
కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ..