*నేటి సాక్షి – మెట్‌పల్లి*
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మెట్‌పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ జువ్వాడి నర్సింగరావు ఆదేశాల మేరకు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ రైసుద్దీన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ నిరసనలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
*ఈ-20 విధానం రద్దు చేయాలి*
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ-20 పెట్రోల్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. పెట్రోల్‌లో ఇథనాల్ శాతం పెంచడం వల్ల వాహనాల మైలేజ్ తగ్గడంతో పాటు ఇంజిన్ల పనితీరుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి వాహనదారులపై అదనపు ఆర్థిక భారం పడుతుందని పేర్కొన్నారు.
*పెట్రోల్ పరిమాణం తగ్గితే.. ధర ఎందుకు తగ్గదు?*
వాహనాల్లో వినియోగించే పెట్రోల్ పరిమాణంలో ఇథనాల్ వాటా పెరుగుతున్నప్పుడు వినియోగదారులకు కలిగే ప్రయోజనం ఏమిటని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. మైలేజ్ తగ్గి వినియోగం పెరుగుతున్న పరిస్థితుల్లో పెట్రోల్ ధరలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సామాన్య వాహనదారులపై భారం తగ్గించేలా విధానాలను పునఃసమీక్షించాలని కోరారు.
*ఎఫ్‌సీఆర్‌ఏ–2026పై అభ్యంతరం*
పేద ప్రజలకు సేవలందించే స్వచ్ఛంద సంస్థలపై ప్రభావం చూపే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఎఫ్‌సీఆర్‌ఏ–2026 విదేశీ విరాళాల నియంత్రణ చట్టం ఉందని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. ప్రజా సమస్యలపై పనిచేసే స్వచ్ఛంద సంస్థల కార్యకలాపాలకు ఈ చట్టం అవరోధంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే సంస్థలను లక్ష్యంగా చేసుకునే విధంగా నిబంధనలు ఉండకూడదని అన్నారు.
*ప్రజా సమస్యలపై పోరాటం*
కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలపై ప్రభావం చూపే విధానాలను పునఃసమీక్షించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. పెట్రోల్ ధరలు, వాహనదారుల సమస్యలు, స్వచ్ఛంద సంస్థల స్వేచ్ఛకు సంబంధించిన అంశాలపై ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మెట్‌పల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ రైసుద్దీన్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, జిల్లా అధికార ప్రతినిధి, జనరల్ సెక్రటరీ, జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పట్టణ కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు, వివిధ హోదాల్లోని పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
---------
Telangana
*కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ధర్నా* ----------- * ఈ-20 పెట్రోల్ విధానం రద్దు చేయాలని డిమాండ్ * ఎథనాల్ కలయికతో వాహనదారులపై భారం: కాంగ్రెస్ * ఎఫ్‌సీఆర్‌ఏ–2026 బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ -----------
Quick Summary:
ఎఫ్‌సీఆర్‌ఏ–2026 బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ ---------
