నేటి సాక్షి,కోదాడ
కోదాడ పట్టణంలో కొనసాగుతున్న యూజీడీ పనులు ప్రజలకు మేలు చేయాల్సింది పోయి తీవ్ర ఇబ్బందులు, అసౌకర్యాలు, ప్రమాదాలకు కారణమవుతున్నాయని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆరోపించారు. నాణ్యతా ప్రమాణాలు, శాస్త్రీయ పద్ధతులు, భద్రతా చర్యలు పాటించకుండా పనులు సాగుతున్నాయని విమర్శించారు. ప్రజల ప్రాణాలు, ఆరోగ్యం కంటే కాంట్రాక్టులు, కమిషన్లపైనే శ్రద్ధ చూపుతున్నారంటూ మండిపడ్డారు.
*22వ వార్డులో పనుల పరిశీలన*
మంగళవారం కోదాడ పట్టణంలోని 22వ వార్డులో జరుగుతున్న యూజీడీ పనులను మల్లయ్య యాదవ్ పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. రోడ్లను తవ్వి నెలల తరబడి పునరుద్ధరించకపోవడం, గుంతలను ప్రమాదకరంగా వదిలేయడం, రాత్రివేళల్లో హెచ్చరిక బోర్డులు, భద్రతా చర్యలు లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
పనులపై అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బంది నిరంతరం పర్యవేక్షించాల్సి ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో తగిన పర్యవేక్షణ కనిపించడం లేదని విమర్శించారు. మంచినీటి పైపులు, డ్రైనేజీ, విద్యుత్ కనెక్షన్లు దెబ్బతింటున్నా వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టడం లేదన్నారు.
*భవిష్యత్ అవసరాలకు* *సరిపోతాయా?*
యూజీడీ వ్యవస్థ భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా శాస్త్రీయంగా, సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించాల్సిన అవసరం ఉందని మల్లయ్య యాదవ్ అన్నారు. ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న పైపుల సామర్థ్యం, డిజైన్, భవిష్యత్ పట్టణ అవసరాలకు సరిపోతాయా? అనే అంశాన్ని నిపుణులతో సమగ్రంగా పరిశీలించాలని డిమాండ్ చేశారు. తగిన సామర్థ్యం లేని పైపులు ఏర్పాటు చేస్తే భవిష్యత్‌లో పట్టణ ప్రజలు మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
*మురుగుకాలువల నిర్వహణ* *ఏదీ?*
యూజీడీ పనులు పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయ మురుగునీటి పారుదల వ్యవస్థను సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. కాలువలను శుభ్రం చేయకపోవడం, నిర్వహణ లేకపోవడంతో దుర్వాసన, దోమల సమస్య పెరుగుతోందని తెలిపారు. దోమల వ్యాప్తితో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల ముప్పు పెరిగే అవకాశం ఉందని, ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
*కాంట్రాక్టు వ్యవహారంపై విచారణ జరపాలి*
యూజీడీ పనులు చేపడుతున్న కాంట్రాక్ట్ సంస్థ పనితీరుపై తమ పార్టీ గతంలోనే పలు ఆరోపణలు చేసిందని మల్లయ్య యాదవ్ పేర్కొన్నారు. కాంట్రాక్టు కేటాయింపులో రాజకీయ సంబంధాలు, ప్రయోజనాలు లేదా నిబంధనల ఉల్లంఘనలు జరిగాయా? అనే అంశంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
గతంలో సింగారం మంచినీటి ప్రాజెక్టులో ఇంజనీరింగ్ వైఫల్యాల పేరుతో ప్రజాధనం దుర్వినియోగమైందని తాము ఆరోపించామని గుర్తుచేశారు. అదే తరహాలో యూజీడీ పనుల విషయంలోనూ అవకతవకలు జరిగాయనే తమ అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేయాలని కోరారు.
*70 మంది కార్మికులతో పట్టణ పారిశుధ్యం*
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కోదాడ పట్టణ పారిశుధ్యం, సుందరీకరణ కోసం 70 మంది ఔట్‌సోర్సింగ్ కార్మికులను నియమించి పరిశుభ్రతకు చర్యలు తీసుకున్నామని మల్లయ్య యాదవ్ తెలిపారు. ప్రస్తుతం పారిశుధ్య కార్మికుల విషయంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా పట్టణ పరిశుభ్రత దెబ్బతిన్నదని ఆరోపించారు. ఒకవైపు యూజీడీ పనులు, మరోవైపు పారిశుధ్య సమస్యలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని అన్నారు.
*ప్రజల ఆరోగ్యం అంటే లెక్క* *లేదా?*
కోదాడ ప్రజల ప్రాణాలు, ఆరోగ్యం అంటే పద్మావతికి లెక్క లేదా? ప్రజల పట్ల బాధ్యత లేదా? కాంట్రాక్టులు, కమిషన్ల విషయంలో చూపిస్తున్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యం, భద్రత విషయంలో ఎందుకు కనిపించడం లేదు?” అని మల్లయ్య యాదవ్ ప్రశ్నించారు.
అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, అయితే అభివృద్ధి పేరుతో నాణ్యతా ప్రమాణాలను పక్కనపెట్టి ప్రజలను నెలల తరబడి ఇబ్బందులకు గురిచేయడం సమర్థనీయం కాదన్నారు.
*కలెక్టర్ జోక్యం చేసుకోవాలి*
జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో క్షేత్రస్థాయిలో యూజీడీ పనులను పరిశీలించి నాణ్యతను తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు. తవ్విన గుంతల వద్ద వెంటనే భద్రతా చర్యలు చేపట్టాలని, దెబ్బతిన్న మంచినీటి, విద్యుత్, డ్రైనేజీ కనెక్షన్లను పునరుద్ధరించాలని, పనులు పూర్తయిన వెంటనే రోడ్లను యథాస్థితికి తీసుకురావాలని కోరారు.
ప్రజాధనం సక్రమంగా వినియోగించడంతో పాటు భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా యూజీడీ వ్యవస్థను నాణ్యతతో పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, అధికారులు స్పందించకపోతే బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో న్యాయపోరాటంతో పాటు ప్రజా క్షేత్ర పోరాటం చేపడతామని మల్లయ్య యాదవ్ హెచ్చరించారు.
Telangana
యూజీడీ పనులపై మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ ఫైర్.. నాణ్యత లేని పనులతో ప్రజలకు ఇబ్బందులు.. వెంటనే నిలిపివేయాలి.. ప్రజారోగ్యం కంటే కాంట్రాక్టులు, కమిషన్లపైనే శ్రద్ధా? కలెక్టర్ జోక్యం చేసుకుని నాణ్యతపై సమగ్ర తనిఖీ చేయాలి..
Quick Summary:
ప్రజారోగ్యం కంటే కాంట్రాక్టులు, కమిషన్లపైనే శ్రద్ధా?

