నేటి సాక్షి గజ్వేల్, :----
ప్రస్తుత వానాకాలం సీజన్‌లో వరి సాగు విస్తీర్ణం ఊపందుకుంటున్న తరుణంలో రైతులకు సరికొత్త సమస్య వచ్చిపడింది. నేలలో నత్రజని శాతాన్ని పెంచి, భూసారాన్ని రక్షించే పచ్చిరొట్ట ఎరువుగా భావించే జీలుగు పంట, ప్రస్తుత తరుణంలో వరి నారుమళ్ల పాలిట శాపంగా మారింది. ముందస్తు అవగాహన లోపించడం, సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడంతో జీలుగు విత్తనాలు చల్లిన పొలాల్లో సాగు చేసిన వరి నారుమళ్లు కొద్దిమేరకు నిలువునా దెబ్బతిని చనిపోతున్నాయి. గజ్వేల్ మండలం ధర్మరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు నరేందర్ రెడ్డి తన 8 ఎకరాల వ్యవసాయ భూమిలో వరి పంట సాగు చేస్తున్నారు. ఇందులో భాగంగానే పచ్చిరొట్ట ఎరువు మేలు చేస్తుందని భావించి ఆయన జీలుగు సాగు చేశారు. అయితే, ఆ జీలుగు వేసిన మళ్లలోనే ఇప్పుడు వరి నారు కొద్దిమేరకు దెబ్బతిని చనిపోతుండటంతో ఆయన తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు పెట్టుబడులు పెరిగి, మరోవైపు నాట్లు వేయాల్సిన సమయం దగ్గరపడుతున్న వేళ వరి నారు ఇలా కుళ్ళిపోతుండటంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అయితే, ఇదే పొలంలో జీలుగు విత్తనాలు వేయకుండా వదిలేసిన పక్క స్థానంలో మాత్రం వరి నారు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో ఏపుగా, పచ్చగా, బలంగా పెరగడం గమనార్హం. పక్కపక్కనే ఉన్న మళ్లలో ఒకచోట నారు చనిపోవడం, జీలుగు లేని చోట నారు బలంగా పెరగడం ఇప్పుడు క్షేత్రస్థాయిలో తీవ్ర చర్చ నియాంశంగా మారింది.సాధారణంగా పచ్చిరొట్ట ఎరువులైన జీలుగు లేదా జనుము మొక్కలను భూమిలో కలియదున్నిన తర్వాత అవి నేలలో పూర్తిగా కుళ్ళిపోవడానికి కనీసం రెండు వారాల (10 నుండి 15 రోజులు) సమయం పడుతుంది. ఈ కుళ్ళిపోయే సహజ ప్రక్రియ జరుగుతున్నప్పుడు నేలలో విపరీతమైన ఉష్ణోగ్రత పెరగడంతో పాటు కొన్ని రకాల రసాయన మార్పులు జరిగి వాయువులు విడుదలవుతాయి. అయితే క్షేత్రస్థాయిలో జీలుగు మొక్కలు పూర్తిగా కుళ్ళిపోకముందే, నేలలో వేడి తగ్గకముందే రైతులు తొందరపడి వరి నారుమళ్లు పోయడం వల్ల ఈ విపరీత పరిణామాలు ఎదురవుతున్నాయి. భూమిలోని వేడికి, వాయువుల ప్రభావానికి లేత వరి వేర్లకు ఆక్సిజన్ అందక అవి కుళ్ళిపోయి చనిపోతున్నాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. నేల సహజసిద్ధంగా ఉండి, జీలుగు విత్తనాలు చల్లని ప్రదేశాలలో ఎటువంటి ఉష్ణోగ్రత మార్పులు లేకపోవడంతో అక్కడ వేరు వ్యవస్థ బలంగా విస్తరించి నారు ఆరోగ్యంగా పెరిగింది.ఈ నేపథ్యంలో దెబ్బతిన్న వరి నారుమళ్లను కాపాడుకునేందుకు రైతులు తక్షణ జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నారుమళ్లలో నిల్వ ఉన్న పాత నీటిని వెంటనే పూర్తిగా బయటకు పంపేసి, ప్రతి రెండు రోజులకు ఒకసారి కొత్త నీరు పెట్టడం ద్వారా నేలలోని వేడిని తగ్గించవచ్చు. దీనివల్ల వేర్లకు ఆక్సిజన్ అంది మొక్కలు మళ్లీ కోలుకుంటాయి. అలాగే, దెబ్బతిన్న నారు వేగంగా కోలుకుని పచ్చబడటానికి లీటరు నీటికి 5 గ్రాముల జింక్ సల్ఫేట్ లేదా స్వల్ప మోతాదులో యూరియాను కలిపి నారుమడిపై పిచికారీ చేయాలని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా గజ్వేల్ పరిధిలోని వ్యవసాయశాఖ అధికారులు స్పందించి, ధర్మరెడ్డిపల్లి గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించి నారుమళ్లను కాపాడుకునేందుకు రైతు నరేందర్ రెడ్డితో పాటు మిగతా రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలు, అవగాహన కల్పించాలని బాధితులు కోరుతున్నారు.
Telangana
భూసారం పెంచే జీలుగుతోనే వరి నారుమళ్లకు శాపం విత్తనాలు వేయని చోట ఏపుగా పెరిగిన వరి నారు
Quick Summary:
విత్తనాలు వేయని చోట ఏపుగా పెరిగిన వరి నారు


