*నేటి సాక్షి – కథలాపూర్ ( రాధారపు నర్సయ్య )*
80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కథలాపూర్ మండలం దూలూరు గ్రామంలో పచ్చని పొలాల మధ్య రైతులతో కలిసి కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కొడిపెల్లి గోపాల్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ నాయకులు స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించారు. రైతుల మధ్య జాతీయ జెండాను ఆవిష్కరించి, మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం రైతులతో సమావేశమై దేశ ప్రగతిలో వ్యవసాయ రంగం, రైతుల పాత్రపై గోపాల్ రెడ్డి మాట్లాడారు.
*అమరుల త్యాగాల ఫలితమే స్వాతంత్ర్యం*
ఎందరో మహానుభావులు, స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలను త్యాగం చేసి దేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించి పెట్టారని కొడిపెల్లి గోపాల్ రెడ్డి అన్నారు. ఆ మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ దేశ అభివృద్ధిలో తమ వంతు బాధ్యతను నిర్వర్తించాల్సిన అవసరం ఉందన్నారు. స్వాతంత్ర్యాన్ని కేవలం వేడుకలకే పరిమితం చేయకుండా దేశాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేయాలని సూచించారు.
*వికసిత్ భారత్-2047లో రైతులదే కీలక పాత్ర*
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని పరం వైభవ స్థితికి తీసుకువెళ్లే లక్ష్యంతో వికసిత్ భారత్-2047 దిశగా ముందుకు సాగుతున్నారని గోపాల్ రెడ్డి తెలిపారు. ఈ మహత్తర లక్ష్య సాధనలో రైతులు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న వ్యవసాయ రంగం మరింత బలోపేతమైతేనే గ్రామీణ భారతం అభివృద్ధి చెందుతుందని అన్నారు.
*సేంద్రియ సాగు వైపు రైతులు అడుగులు వేయాలి*
రైతులు సేంద్రియ పంటల సాగు వైపు మళ్లాల్సిన అవసరం ఉందని గోపాల్ రెడ్డి సూచించారు. పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి నాణ్యమైన, ఆరోగ్యకరమైన పంటలను పండించడం ద్వారా ప్రజలకు విషరహిత ఆహారాన్ని అందించవచ్చన్నారు. రైతులు మంచి పంటలను పండించి ప్రజలకు పురుగుమందుల అవశేషాలు లేని ఆహారాన్ని అందిస్తే ఆరోగ్య భారత నిర్మాణానికి వారు ప్రత్యక్షంగా భాగస్వాములు అవుతారని పేర్కొన్నారు.
*పంటలకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించాలి*
రైతులు పండించిన నాణ్యమైన పంటలకు దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్‌ను కూడా అందిపుచ్చుకునేలా వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవాలని గోపాల్ రెడ్డి అన్నారు. రైతులు పండించిన పంటలను విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి తీసుకెళ్లడం ద్వారా వారికి మెరుగైన ఆదాయం లభిస్తుందని తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులకు విలువను పెంచి, రైతులు ఆర్థికంగా స్వావలంబన సాధించినప్పుడే వికసిత్ భారత్ నిర్మాణంలో వారి భాగస్వామ్యం మరింత బలపడుతుందని అన్నారు.
*రైతులతో కలిసి జాతీయ పండుగ*
పచ్చని పొలాల్లో రైతుల మధ్య జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జెండా ఆవిష్కరణ అనంతరం రైతులు, బీజేపీ నాయకులతో కలిసి మిఠాయిలు పంచుకున్నారు. దేశ స్వాతంత్ర్యం, రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి, వికసిత్ భారత్ నిర్మాణం వంటి అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి నరెడ్ల రవి, మాజీ సర్పంచ్ లక్ష్మీనర్సయ్య, బీజేపీ నాయకులు పిడుగు వినోద్ రెడ్డి, బాపురెడ్డి, చిర్నం రాజారెడ్డి, గణేష్, రాజు, జలంధర్ రెడ్డి, అల్గోట్ సత్యం తదితరులతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.
____________
Telangana
*పచ్చని పొలాల్లో..'పంద్రాగష్టు' వేడుకలు* -------------------------- * రైతులతో కలిసి '80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని' నిర్వహించిన కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కొడిపెల్లి గోపాల్ రెడ్డి * సేంద్రియ సాగుతో ఆరోగ్య భారత నిర్మాణం సాధ్యం * రైతుల ఆర్థిక స్వావలంబనతో వికసిత్ భారత్ లక్ష్యానికి బాటలు -----------
Quick Summary:
రైతుల ఆర్థిక స్వావలంబనతో వికసిత్ భారత్ లక్ష్యానికి బాటలు