నేటి సాక్షి గజ్వేల్ :--=
రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరిన ఆరు మాసాలు కూడా గడవకముందే కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాసమస్యలను పక్కనపెట్టి, ఖజానా నుంచి నిధులు ఎలా ఖర్చు చేయాలనే దానిపైనే దృష్టి సారిస్తున్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ 5వ వార్డులో వెలుగుచూసిన రోడ్డు వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
*ప్రజల సొంత నిధులు.. ‘మెయింటెనెన్స్’ బిల్లుల మాయాజాలమా?*
వార్డు నెం. 5 పరిధిలో మున్సిపాలిటీ నుంచి స్పందన లేకపోవడంతో స్థానిక ప్రజలు తమ సొంత డబ్బులతో సీసీ రోడ్డు నిర్మించుకున్నారని స్థానికులు చెబుతున్నారు. అయితే ఆ రోడ్డును మున్సిపల్ ఖాతాలో చూపించి ‘మెయింటెనెన్స్’ పేరుతో బిల్లులు పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం అక్కడికి వెళ్లి క్వాలిటీ చెకప్ పేరుతో డ్రిల్లింగ్ చేపట్టడం స్థానికుల్లో అనుమానాలకు తావిచ్చింది.
*ఆరు నెలలకే అధికార దాహం.. అంతా ‘కమిషన్ల’ కోసమేనా?*
"పాలకవర్గం ఏర్పడిన కొద్ది రోజులకే కొంతమంది కౌన్సిలర్లు ప్రజల సొమ్మును దోచుకునేందుకు వివిధ మార్గాలను వెతుకుతున్నారు" అని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిధులతో చేపట్టిన పనుల నాణ్యతపై దృష్టి పెట్టకుండా, ప్రజలు తమ సొంత డబ్బులతో నిర్మించుకున్న రహదారులపైనా మున్సిపల్ నిధుల పేరుతో జోక్యం చేసుకోవడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
ముఖ్యంగా అవినీతికి అవకాశం ఉన్న ప్రతి చోటా జోక్యం చేసుకుంటూ, అందినకాడికి దోచుకునేలా వ్యవహరిస్తున్నారంటూ ప్రజలు ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. ప్రజాధనానికి సంబంధించిన ప్రతి వ్యవహారంలో పారదర్శకత పాటించాలని, ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలని మున్సిపల్ కమిషనర్న ను స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ వ్యవహారంలో వాస్తవాలను వెలికితీసేందుకు ఉన్నతస్థాయి అధికారులు సమగ్రంగా విచారణ జరిపి, నిధుల వినియోగం, పనుల అనుమతులు, బిల్లుల వివరాలను బహిర్గతం చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Telangana
ఆరు మాసాలకే 'ఆకాశమంత' అవినీతి! కొత్త పాలకవర్గం కొల్లగొట్టుడు.. 'మెయింటెనెన్స్' పేరిట ప్రజల సొమ్ము దోపిడీకి స్కెచ్! జనం సొంత పైసలతో వేసుకున్న రోడ్డుపై అధికారుల ‘డ్రిల్లింగ్’ జిమ్మిక్కులు! కౌన్సిలర్ల కాసుల కక్కుర్తి... గజ్వేల్‌లో బట్టబయలైన బాగోతం
Quick Summary:
జనం సొంత పైసలతో వేసుకున్న రోడ్డుపై అధికారుల ‘డ్రిల్లింగ్’ జిమ్మిక్కులు