Telangana
*మంత్రి వ్యాఖ్యలపై బీజేపీ నేతల మండిపాటు* * బీజేపీ–బీఆర్ఎస్ ఒక్కటేననడం సరికాదు * ప్రజల దృష్టి మళ్లించేందుకే ఆరోపణలు
Quick Summary:
ప్రజల దృష్టి మళ్లించేందుకే ఆరోపణలు
*నేటి సాక్షి, ఎండపల్లి:* బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనంటూ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం చేసిన వ్యాఖ్యలను బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. శనివారం ఎండపల్లిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షుడు రావు హనుమంతరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కొమ్ము రాంబాబు మాట్లాడుతూ.. మంత్రి వ్యాఖ్యలు రాజకీయ అవగాహన లేమికి నిదర్శనమని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ సిద్ధాంతాలు, విధానాలు పూర్తిగా భిన్నమైనవని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా ప్రతిపక్ష పార్టీలపై ఆరోపణలు చేయడం మంత్రికి తగదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సైతం బీజేపీ నిరంతరం పోరాడిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనంటూ మంత్రి కొత్త ప్రచారానికి తెరలేపారని మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్నారని, పార్టీ కార్యకర్తలే తమ బలమని పేర్కొన్నారు. మంత్రి ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం కంటే నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీజేపీ మండల జనరల్ సెక్రటరీలు మంచికట్ల రవి, మేడిపల్లి రాజశేఖర్, ఉపాధ్యక్షులు గోపనవేని గంగాచలం, మూల ప్రశాంత్, బీజేవైఎం జనరల్ సెక్రటరీలు మేడిపల్లి రాజు, తిరుమల ప్రమోద్, జిల్లా నాయకుడు సట్టా రవిరాజ్, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు దేవి సంతోష్, బూత్ అధ్యక్షుడు కొదురుపాక అశోక్, మండల పార్టీ సెక్రటరీ దాసరి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.