నేటి సాక్షి గజ్వేల్: ----
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ అధికారుల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్య ప్రజలు తాగునీరు, కనీస మౌలిక వసతుల కోసం మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా నిబంధనల పేరుతో తిప్పిపంపుతున్న అధికారులు.. ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వెంచర్ల విషయంలో మాత్రం ఉదారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో ఉన్న ‘చంద్రవిహార్’ ప్రైవేట్ వెంచర్‌లో మిషన్ భగీరథ పైప్‌లైన్ పనులు చేపట్టడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చంద్రవిహార్ వెంచర్‌లో ప్రస్తుతం ఒక్క ఇల్లు కూడా లేకపోయినా, పెద్దఎత్తున పైప్‌లైన్ పనులు చేపట్టడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జనావాసాలు లేని ప్రైవేట్ వెంచర్‌కు ఇంత అత్యవసరంగా పైప్‌లైన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. పట్టణంలోని పలు కాలనీల్లో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నా అక్కడి సమస్యలను పట్టించుకోని అధికారులు, ప్రైవేట్ వెంచర్‌కు మాత్రం ప్రాధాన్యం ఇవ్వడం వెనుక కారణమేంటని నిలదీస్తున్నారు.
ప్రభుత్వ నిధులతో చేపడుతున్న ఈ పనుల వల్ల మున్సిపాలిటీకి, ప్రజలకు కలిగే ప్రయోజనం ఏమిటో అధికారులు స్పష్టం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల అవసరాల కోసం వినియోగించాల్సిన నిధులను ప్రైవేట్ వెంచర్ అభివృద్ధికి మళ్లిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైప్‌లైన్ ఏర్పాటుతో వెంచర్ విలువ పెరిగి, భవిష్యత్‌లో ప్లాట్ల ధరలు పెరిగేలా చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, వీధిలైట్ల వంటి కనీస సౌకర్యాల కోసం సామాన్యులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా నిబంధనల పేరుతో కొర్రీలు పెడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. అదే సమయంలో జనావాసాలు లేని ప్రైవేట్ వెంచర్‌లో భారీగా మౌలిక వసతుల పనులు చేపడుతున్నారనే ఆరోపణలు రావడం అధికారుల పనితీరుపై అనుమానాలకు తావిస్తోంది.
చంద్రవిహార్ వెంచర్‌కు పైప్‌లైన్ ఏర్పాటుకు అనుమతులు ఎలా వచ్చాయి? నిధులు ఏ పథకం కింద మంజూరయ్యాయి? పనులకు పరిపాలనా, సాంకేతిక అనుమతులు ఉన్నాయా? ప్రజాధనంతో ప్రైవేట్ వెంచర్‌కు మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఏమిటి? వంటి అంశాలపై సమగ్ర విచారణ జరపాలని 5వ వార్డు ప్రజలు కోరుతున్నారు. పనుల అంచనాలు, అనుమతులు, నిధుల మంజూరు, టెండర్ ప్రక్రియ తదితర వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రజాధనం దుర్వినియోగమైందనే ఆరోపణలు నిజమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే పనుల వెనుక ఉన్న వాస్తవాలను అధికారులు ప్రజలకు స్పష్టం చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు తక్షణమే దృష్టిసారించి నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
Telangana
ఖాళీ వెంచర్‌కు మిషన్ భగీరథ పైపులైన్లు!
Quick Summary:
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ
